Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters   

సంధ్యా[విప్ర] ప్రబోధము

సూర్య కుటుంబము, ఉపాసనము

1సూర్యుడు, 2చంద్రుడు, 3కుజుడు 4బుథుడు 5గురుడు 6శుక్రుడు 7శని 8రాహువు 9కేతువు అనువారు నవగ్రహములుగా పూర్వులచే పేర్కొనబడెను.

గ్రహములకు సహజకాంతి లేదు. సూర్యునకు సహజ ప్రకాశము కలదు. కాన 1 సూర్యుని గ్రహముల పట్టినుంచి ఆధునికులు తొలగించిరి. 2. చంద్రుడు భూమి చుట్టును నెల కొక తూరి పరిభ్రమించు చుండు ఉపగ్రహమని తలంచి, చంద్రుని కూడ గ్రహములపట్టి నుంచి తొలగించిరి. 3రాహువు 4కేతువు యిఉభయులును ఛాయా గ్రహములని, గ్రహముల పట్టి నుంచి తొలగించిరి. ఆ నలువురి స్థానములలో 1 భూమిని. 2. యూరేనస్‌ 3. నెప్ట్యూన్‌ 4. ప్లూటో యనువానిని క్రొత్తగా ఆధునిక ఖగోళశాస్త్రపండితులు గ్రహములపట్టికలో చేర్చిరి.

నవీనులు తొలగించినను చేర్చినను, నవగ్రహములుగనే వచింవుచు సంఖ్యను మార్చలేదు. కాని జ్యోతిషశాస్త్రమన పూర్వమునుంచియు, ''మాంది''యను నొక గ్రహము కలదు. ఆ మాందీ గ్రహముతో చేరి పూర్వపండితులు పదిసంఖ్యగా నిర్ణయించిరి. శ్రీమహావిష్ణువు యొక్క అవతారములలో దశావతారములు సుప్రసిద్ధములై యున్నవి. ఆ యవతారము లీగ్రహములేసుమా!

''ఆదిత్యో ఆదిభూతత్వాత్ప్రసూతో సూర్య ఉచ్చతే'' ఇతి సూర్య సిద్ధాంతే భూగోళాధ్యాయే ఉక్తం-

ఆదిత్యు డదితిగర్భ ప్రధమ ప్రసూతుడగుటచే సూర్యుడని చెప్పంబడెను. కావున ప్రత్యక్ష దైవమనియు ననంబడును. ఇట్లు సూర్యసిద్ధాంతమున భూగోళాధ్యాయమందు చెప్పబడెను. ''భర్గోవైవిష్ణుః'' - భర్గశ్శివేచ సూర్యేచ'' - అని చెప్పంబడెను. ''భర్గోదేవస్యధీమహి'' అనుచు మనము నిత్యము ధ్యానము చేయుచుంటిమి. అనుటచే, భర్గస్సు అను శబ్దమునకు శివుడనియు సూర్యుడనియు విష్ణువనియు అర్థము చెప్పబడెను. మరియు శక్తి (చిచ్ఛక్తి) అనియు గణపతి యనియు చెప్పబడుచు పంచాయతనపూజనమును సమిష్టిగా చేయు చుంటిమి. సూర్యుడు జ్యోతిస్స్వరూపుడు. జ్ఞానులను యోగులను అర్చిరాది మార్గమున జ్యోతిర్మండలమగు సూర్యగోళమును ఛేదించుకొని సూర్యగోళమను ద్వారమున సూర్యమండలాం తర్వర్తియగు పరంజ్యోతియగు పరమాత్మను చేరుదురు. బ్రహ్మ సూత్రములందు జ్యోతోధికరణము గలదు.

జ్యోతిర్విద్య 1. సిద్ధాంతభాగము 2. జాతకభాగము 3. ముహూర్తభాగము అను స్కంధత్రయముతో గూడియున్నది. 24 హోరలతో గూడినది అహో రాత్ర పరిమాణము ద్వాదశరాసులతో ఖగోళమున్నది. అదియే గాయిత్రి దీనికి మూడు పాదములును 24 కర్ణమలును 12 నెలలందును 12నామములతో సూర్య ప్రభ వెలుగుచున్నట్లును, ఖగోళములో 12 రాసులున్నట్లును, ఒక్కొక్కరాశిలో 9 నవనక్షత్ర పాదము లుండుననియు. ఆ నవశబ్దమే ప్రణావాత్మకమనియు ఓమత్యే కాక్షరం బ్రహ్మమనియు తెలుపబడి యున్నది.

సూర్యమండలాం తర్వర్తియగు పరమాత్మను తెలిసికొనవలయుననెడి = ఆత్మజిజ్ఞాసువు ఆర్యుడని అట్లె ఉపనిషత్తున తెలుపబడెను, కాని మధ్య ఆసియానుంచి వచ్చిన మానిసి ఆర్యుడు కాడు. అంతకు పూర్వము అచటనున్నది అనార్యుడని గాని, ద్రావిడుడనిగాని వ్రాయువ్రాతలు వేద సమ్మతములుగావు. భూచరాంరత్యోసి=భారతాఃఅట్టి సూర్యభావమును తెలిసికొనుటకు ఆసక్తి కలవారే భారవులు=భారతీయులు అని ఎరుగవలయును. వరాహమిహిరహోర శాస్త్రమున గాంచనగును.

ఐహిక సంపదలన్నియు పరమాపదల కాకరము లగును. వాని సంయోగములో ఎప్పటికైనను వియోగమునే చేకూర్చును. ఆ సంపద్వియోగమున మానసికమగు వ్యాథులు (విచారము=దుఃఖములు వ్యధలు=క్లేశములు) సంభవించును. వాని వలన శారీరక వ్యాధులు (రోగాదులు) తప్పక సంభవించును. ఇవి యన్నియు ఆపదలే సుమా! ఆ సర్వవిధమగు ఆపన్నివారణమునకునై సూర్యమండలాంత ర్వర్తి యగు హరిని ప్రార్థింపవలెను. గ్రంథవిస్తర భీతిచే విపులముగా చెప్పక నిలుపుచేయబడెను.

శ్లో|| రామోవతార స్సూర్యస్య చంద్రస్యయదునాయకః|

నృసింహో భూమి పుత్రస్య బుద్ధ స్సోమసుతస్య చ|

వామనో విబుధేజ్యస్య భార్గవో భార్గవస్య చ|

కచ్ఛప సూర్య పుత్రస్య సైంహికే యస్య సూకరః||

కేతోర్మీనావ తారస్య|| ఇతి పరాశ రేణోక్తం||

''పరి శేషాత్కాల రూపస్య మాందేః కల్కీ'' ఇతి సూచ్యతే. అత ఏవోక్తం శ్రీమచ్ఛంకర భగవత్పూజ్య పాదైశ్చ స్రగ్ధరావృత్తం-

శ్లో|| మత్స్యః కూర్మో వరాహో నరహరిణపతి ర్వామనో

జామదగ్న్యః|

కాకుత్థ్సః కంసఘాతీ మనసిజ విజయీ యశ్చకల్కీ భవి

ష్యన్‌||

విష్ణోరం శావతారా భువనహితకరా ధర్మ సంస్థాపనార్ధాః|

పాయాసుర్మాంత ఏ తేగురుతర కరుణా భార భిన్నాశ

యాయే||

కావున శ్రీ పరాశర మహర్షియు. పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ మచ్ఛంకర దేశికులును మాందితో గూడిన దశ సంఖ్యాక గ్రహములను శ్రీ మహావిష్ణుని దశ సంఖ్యాకమగు అంశావతారములని వచించి యుండిరి. 1 సూర్యుని అంశావతారము సూర్యుని వంశమున జనించిన దశరధ మహారాజపుత్రుడగు శ్రీ రాముడు 2 చంద్రుని అంశావతారము యుదు వంశోద్భవుడగు బలరాముడు (శ్రీ కృష్ణుడు) 3 కుజుని అంశావతారము ఆగ్ని స్వరూపుడగు నృసింహమూర్తి 4 బుధుని అంశావతారము బుద్థదేవుడు 5 బృహస్పతి అంశావతారము వామనమూర్తి, 6 శుక్రుని అంశావతారము పరశురామమూర్తి 7 శని యొక్క అంశావతారము కూర్మమూర్తి 8 రాహుని అంశావతారము వరాహమూర్తి 9 కేతుని అంశా వతారము మన్మథుని కేతనం అగు మీనమూర్తి10 పరిశేష న్యాయముచే మాందీ గ్రహాంశావతారము కాలమూర్తియగు కల్కిమూర్తిగను వర్ణింపబడియెను. ఇట్లు వరామిహహిరా చార్య కృతహోరా--శాస్త్ర మనియెడి జ్యోతిష గ్రంథరాజమున చెడ్పబడెను.

1 తత్‌ 2 సవితుః 3 వరేణియా 4 భర్గః 5 దేవస్య 6 థీమహి 7 ధియః 8 యః 9 నః 10 ప్రచోదయాత్‌ అనుగాయత్రీ సూత్రములో పది పదములు గలవు. మాందీ గ్రహముతో గూడిన గ్రహముల వలెను. అవతారములు వలెను పది పదములును ద్విజులు కనీసము గాయత్రీ మంత్రమును పది పర్యాయములైనను జపింపుమని సూచించుచున్నవి. క,ట,ప, యా ది సంజ్ఞలచే యీ మంత్రమునకు వంద సంఖ్య అని తెలియుచున్నది.

త త్సవితుర్వి రేణ్యం

6+7+4+6+4+2+1= వీనిని కలుపగా 30 అగును

భర్లో దేవస్య ధీమహి

4+3+8+4+1+9+5+8= 42 అగును

ధియోయోనః ప్రచోదయాత్‌

9+1+1+0+2+6+8+1= 28 అగును

గాయత్రి (గురు) మహామంత్ర మందలి వర్ణముల

గుర్తుల మొత్తము సంఖ్య 100

ఈ అక్షర సంజ్ఞల మొత్తమును, మంత్రములోని పదముల సంఖ్యచే గుణించిన ఎడల అనగా 100x10=1000 అగును. ఈ సంఖ్య ''సహస్ర పదమాదేవీ'' అను సూక్తీచే గాయత్రీ మంత్ర జప ''పరమావధి''ని తెలుపుచున్నది.

ఈ వంద సంఖ్యను మంత్రమున గల పదముల సంఖ్యచే భాగించిన ఎడల

అనగా 100%10=10 అగును. ఈ సంఖ్య ''దశావరా'' అను సూక్తిచే గాయత్రీ మంత్ర జపమునకు అవర=కనీస సంఖ్యను సూచింపుచున్నది.

II కటపయాద్యక్షర సంఖ్య వలన గలిగిన వంద సంఖ్య గాయత్రీ మంత్ర జపమునకు ''శతమధ్యా'' అను సూక్తిచే మధ్యను అవధిని (సంఖ్యను) బోధింపుచున్నది. కాన కనీసము పది పర్యాయములైనను గాయత్రీ మంత్ర జపానుష్టానము చేయుమని ప్రబోధించుచున్నది.

శ్లో|| ప్రణవ వ్యాహృతి యతాం గాయత్రీంతు తతోజపేత్‌|

త్రివిధో జపయజ్ఞ స్స్యాత్‌ తస్య భేదం నిబోధత||

ఇతి వ్యాసః

శ్లో|| జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః

జన్మ పాప వినాశత్వాత్‌ జపశబ్ద ఉదీరితః

ఇతి. (జపఇత్యభిథీయతే)

జపమనునది యొక్క యజ్ఞము, జ=జన్మమును అనుటచే మరణమునకును, ఉపలక్షణమని భావించుడు. జన్మించిన దేహంమృతి నొందుటయు, మృతి నొందిన దేహము మరల పుట్టుటయు లోకమున సహజమై ప్రసిద్ధముగ విననగును.

''జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ'' భ.గీ. స్మృతిచే జననమునకును మరణమునకును మిక్కిలి అవినాభావముగ (దగ్గర) సంబంధము కలదు. ప=పాపసంచయములను నశింపజేయును. ''జపతో నా స్తిపాతక''మ్మని చెప్పబడియెను. కాన జనన మరణ కూప సంసార (భవ) సాగరమును శోషింపజేయును. పాపరాసులను దహింపజేయును. కాన ఇది జప మనంబరగును. 1 ద్రవ్య యజ్ఞములు 2 తపోయజ్ఞములు 3 యోగ యజ్ఞములు 4 స్వాధ్యాయ యజ్ఞములు 5 జ్ఞాన యజ్ఞములు అని భగవద్గీతలో చెప్పబడెను. జపము స్వాధ్యాయ యజ్ఞములో చేరును.

శ్లో|| సర్వ వేద పురాణషు సాంగో పాంగేషు యత్ఫలం|

సకృదస్య జపాదేవ తత్ఫలం ప్రాప్నుయాన్నరః|| ఇతి.

షడంగములును, ఉపాంగములతో గూడిన సమస్త వేదములందును, వేదోప బృంహణములగు పురాణములందును అనగా వానిని చదివి సత్కర్మా చరణము వలన, నే ఫలము ప్రాప్తించునో అట్టి సత్ఫలమును, గాయత్రీ మంత్ర జపానుష్ఠానము పలననే ఒక్కసారిగా అట్టి ఫలమంతయును లభించును. కాన ఇది (జపము) యొక్క యజ్ఞ మనంబడును, యజ్ఞమనగ దేవతలను సంతృప్తి పఱచుటకు చేయదగిన యొక వైదికమగు పుణ్యకార్యము. ''యజపూజనే'' యను ధాతువు వలన జనించిన శబ్దము. దీనివలన కుంభిని యందు కుంభవృష్టి సమృద్ధిగ నెల కొకతూరి వర్షించి సస్యములను ఫలింపజేసి, పశు పక్షి మృగ వృక్ష సస్య మానవ సముదాయమును జీవింపజేయును. సుఖంపజేయును, క్షామ బాధా నివారణ మొనర్చి జీవులను వేధించు దుఃఖములను పోగొట్టును. ''యజ్ఞా ద్భవతిపర్జన్యః పర్జన్యాదన్న సంభవః| అన్నాద్భవంతి భూతాని'' యను గీతా సూక్తిచే మనకు పై విషయము బోధపడుచుండెను.

యజ్ఞమనగ = యజన మనబడును, య=యమనియ మాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులనియెడి అష్టాంగ యోగములలోని ప్రాణాయామముచే నియమము కలిగి ఇంద్రియములను సై#్వర విహారముగాను, విచ్చల విడిగను, నడువనీయక వారి సహజ వ్యాపారమును అడ్డగించుట, ఇది మానసిక వ్యాపారము, మానసిక వ్యాయామము=మానసిక క్రియ యని యెఱుంగవలయను. జ=అనగ జపము, ఇది వాచికముగ చేయు వ్యాపారము. (నోటితో మెల్లగను, స్పష్టముగను (ఉపాంశువుగ) మంత్రమును వచించుట. ఇది వాచిక క్రియయని తెలియదగును. న=అనగ 'నమనము'=నమస్కారము. ఇది కాయికముగ నొనర్చు వ్యాపారము. దీనివలన వినయము, విధేయత, పాప భంజనము అను ఫలములు ఏర్పడును. ''ఆచమనాద్యసా వాదిత్యో బ్రహ్మా'' వరకు చేయునది మానసిక క్రియ- జపము వాచిక క్రియ, ''గోవిందాయనమోనమః'' ''సీతాయాః పతయేనమః'' ''సర్వ దేవ నమస్కారః శ్రీ కేశవం ప్రతిగచ్ఛతి'' మున్నగు దిజ్నమస్కారము మొదలు చేయు ఉత్తరాంగము కాయిక క్రియ ఇట్లు సంధ్యోపాస్తియను యజనమున త్రికరములతో చేయు ఉపాసన ఇమిడియున్నది. మా=మానసికము, వా=వాచికము, కా=కాయికము అను త్రివిధ శరణ క్రియలుగలవు సంఖ్యాశాస్త్రము ననుసరించి కటపయాది సంజ్ఞలను పరికించుడు.

III మా=5, వా=4, కా=1 వీని మొత్తము 10 సంఖ్యయగును. కాన గాయత్రీ మహా మంత్రములోని పది పదములను త్రికరణములగు వాని సంఖ్యయగు పది పర్యాయము లైనను కనీస అవధినైనను జపానుష్ఠాన మొనరింపుడని విప్రజనాళికి ప్రబోధించుచున్నది.

IV శ్రీ మాహావిష్ణుని దశావతారములలో మిక్కిలి సుప్రసిద్ధమైన అవతారము రామావతారము. కటపయాద్యక్షర సంఖ్యలతో పరికించుడు.

రా=2x=5=10 ఇట్లు గుణించిన పది యగును. గాయత్రీ మంత్రములోని పదములు రామ శబ్దమును, రామాయణ గ్రంథ పారాయణ ఫలమును ఓసంగును. రామాయణం గాయత్రీ మంత్రాక్షరములగు ఇరువది నాలుగు వర్ణములను సూచింపుచు గాయత్రీ తత్వమును మనమున నిడికొని శ్రీ వాల్మీకి మహర్షి (దశావతారములలో 7వ అవతారమైన రామ చరితమును ఏడు కాండలుగ) రామాయణమును రచించి లోకమున కందించెను. ఇంకొక విశేషమేమన - రాముడు దశరధాత్మజుడనై అవతరింతునని దేవతలకు వైకుంఠమున వరమొసంగెను. ఇందువలన తెలియదగునది ఏమనగ-దశరధునకు పది రధములుండుటయు లేక దశరధుని రధము దశ దిశలను సంచరించగల శక్తివంతమైన దనియు, దశరధ నామములోని దశ శబ్దము తెలుపుచున్నది, ''దశః పక్షీ విహాంగమః'' అని కోశము గలదు, గరుత్మంతుడు రధము=వాహనముగ గలవాడు శ్రీ మహావిష్ణువు. అతని అవతారము రాముడు 1 విహంగమ మార్గము=2 శుక మార్గము 3 ఉత్తర మార్గము 4 అర్చిరాది మార్గము. పరమార్థము నెరుంగుటకు ఉత్తమ మార్గమనియు సూచించును, వామదేవ మార్గము=పిపీలికా మార్గము, దక్షిణ మార్గము, ధూమాది మార్గము. పరమార్థ మెరుంగుటకు రెండవ కక్ష్యకు చెందిన మార్గమనియు సూచించును, దశరధునకు తనయుడై అవతరించుటకు కారణమేమి? గాయత్రీ మంత్రా క్షరములకు కటపయాద్యక్షర సంజ్ఞచే వంద=100=అని తెలియనయ్యెమ. శతయోజన విస్తీర్ణమైన సముద్రము (సంసారసముద్రము)న కవ్వలి యొడ్డున లంకయను నవద్వార పురమగు శరీరమనెడి లంకలో నున్న జీవుడు మహా తపస్వియు, మహా భక్తుండును, తన ఎడబాటును సహింపజాలక శత్రుత్వముచే గాని త్వరలో విష్ణు సాన్నిధ్యమునకు చేరుట కవకాశములేని వరమును పొందియుండుట చేత, విరోధ మార్గమున దశముఖుడు యత్నించెను. వాని నుద్ధరించుటకై రాము డవతరించెను. వాని నామములోని దుశముఖ = దశకంఠ శబ్దములోని దశ శబ్దము పది, దశముఖుని ఉద్ధరించుటకై రా 2+మ5=7వ సంఖ్యుయగు ''మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బౌద్ధః కలికి రేవచః'' దశావతారములలో సప్తమావతారమును ధరించి రాముడు అవతరించెనని తెలియుచున్నది. దశ=అంచు, అనగా ఓడ్డు. అనగా సంసార సాగరమునకు దరియని భావము. కాన జనన మరణ రూప సంసార సాగరమును తరియించి దరిచేరుటకు గాయత్రీ మహా మంత్రానుష్ఠానమును పది పర్యాయములైనను కనీసము జపించుమని బాడబాళికి ప్రబోధ మొనర్చుచున్నయది. శ్రీ మద్వాల్మీకి రామాయణము- దాని స్వరూప స్వభావములును, 1 ధర్మ 2 అర్థ 3 కామ 4 మోక్షములనెడి పురుషార్ధములను పాత్రలుగ వహించిన 1 రామ 2 లక్ష్మణ 3 భరత 4 శత్రుఘ్న మూర్తులు 1 ఋక్‌ 2 యజుస్సు 3 సామ 4 అధర్వణ వేదమూర్తులై 1 శమము 2 విచారణ 3 సంతోషము 4 సత్సంగతి యనెడి, మరియు 1 కామ రాహిత్యము 2 వాంఛా రాహిత్యము 3 మమకార రాహిత్యము 4 అహంకార రాహిత్యము అనెడియు, మరియు 1 సాక్షాత్కారము 2 చమత్కారమనెడి మహిమ, 3 పరోపకారము 4 సంస్కారము అనెడి చతుర్విధ ఉపాయములనెడి సోపానములను పరమార్థ సౌధారోహణమునకు సూచించుచుండిరని ప్రబోధించుచున్నది.

(స శేషము)

Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters